నక్కి నక్కి నోట కరచేను కామ క్రోధములు,
వెక్కి వెక్కి ఏడ్చాను నీవు నా చెంతన లేక.
తొక్కి తొక్కి నలిపేను లోభ,మోహములు,
బిక్కు బిక్కు మన్నాను నీవు నా తోడు లేక.
రక్కి రక్కి గీచేను మద,మాత్సర్యములు,
దిక్కు దిక్కు వెతికాను నీ జాడ తెలియ లేక.
పూజలేమో నాకు తెలియదు, నీ నామము పిలుచుట తప్ప,
జపమేమో నాకు తెలియదు, నీ కొరకై తపము తప్ప,
నాదమేదో,భేదమేదో నాకు తెలియదు, నీకై ఖేదము తప్ప,
మంత్రమేదో,తంత్రమేదో నాకు తెలియదు, నిను ముద్దాడే స్వ తంత్రము తప్ప.
శ్వాసించే ఊపిరే నీకు ధూపము,
లోపల వెలిగే జీవుడే నీకు దీపము,
ప్రవహించే రక్తమే నీ కాలికి పారాణి,
నీవు కాని 'నేను' యే నీకు నైవేద్యం,
విలపించే కన్నీరే నీకు అభిషేకం అనుకో అమ్మా...!
కోపమొస్తే కొట్టు గాని, కనిపించుట మానకు. కంట నీరు పెడతాను,
తప్పు చేస్తే తిట్టు గాని, తలచుట మానకు. తల్లడిల్లి పోతాను.
ఏడ్చి ఏడ్చి అలసి సొలసి పోయాను. నీ ఒడి ని చేరి సేద తీర తలచాను,
ఇంకనూ నీవు కనిపించకుంటే, నన్ను అక్కున చేర్చుకోకుంటే....ఈ ఊపిరి ఆగేను, ఈ దీపం ఆరేను,
నేను నీవైపోతాను. నీలో కలిసిపోతాను.
నేను నీవైపోతాను. నీలో కలిసిపోతాను...!
కరుణించి కనిపించవమ్మా...అమ్మల గన్న యమ్మ..నను గన్న మాయమ్మ.
ముగురమ్మల మూలపుటమ్మ...చాల పెద్దమ్మ...అమ్మా...అమ్మా..అమ్మా...!