27, సెప్టెంబర్ 2012, గురువారం

ఏకమేవా ద్వితీయం

కుడి కన్ను శివుడు, ఎడమ కన్ను శక్తి
ఏ కంటితో చూసేది, ఎవరిని చూసేది అని
కుడి ఎడమల నడుమ నలిగింది నా చూపు

ఇద్దరూ ఒకటే, ఇద్దరై ఒకటే
నేనేమి చేసేది కుడి ఎడమ గ మీరుంటే

అలక మాని, సంధి చేసుకుని
కుడి ఎడమల భ్రూమధ్యమునకు చేరి
ముచ్చటగ మూడో కన్ను మీరు నాకిస్తే

చూసెదను కదా అర్ద నారీశ్వరమును
ఏకత్వము గ 'నేను' మైమరచి, 'నేను' ను మరచి

ఏకమేవా ద్వితీయం...అర్ద నారీశ్వరం...శివోహం శివోహం

నీ ఎడబాటు మరచుటకై

నీ ఎడబాటు మరచుటకై
నేను తలచితి ఒక రూపాన్ని నా మదిలో
నలుగు బెట్టి ఊపిరూది గణపతి గ మార్చితి
నలుగు పెట్టే వేళ నలుసంత జారి
దివి నుండి భువికి వచ్చె

నలుసు ఇంతింతై ఎదిగి నరుడిగ మారె
నరుడి నడతను మార్చి, నడకను నేర్పి
నీ లోని  'శక్తిగ నను మార్చితివి

విభూతి ప్రియుడవు నీవని తెలిసి,
నీ విరహాగ్నిలో 'నేను' దహనమై భస్మమైతిని

నలుసంత భస్మము తీసి నీ నుదిటిన బెట్టితివో
నిను చేరి నీ ఎడబాటు మరిచెదనురా నమః శివాయ....!

17, సెప్టెంబర్ 2012, సోమవారం

ఆనందం ?

"ఓ భగవంతుడా...! ఇన్ని కోట్ల జన్మలు ఎత్తాను. ఆనందం అని అనుకున్నది ఏదీ చివరికి ఆనందం కాదు అని తెలుసుకున్నాను. నేను ఆనందం అని అనుకున్న ప్రతీది నిజానికి దుఃఖ హేతువు. జీవిత పరమార్ధం, గమ్యం ఐన నిన్ను నేను తెలుసుకోగలిగాను.
ఇదే ఇప్పుడు నాకు నిత్య,సత్యమైన ఆనందం అని అర్ధం అయ్యింది.నేనే నీవు, నీవే నేను అని అర్ధం అయ్యింది. ఇక
నాకు ఆ ఆనందం కూడా వద్దు. నువ్వు చాలు అని అంటూ...ముఖము పై చిరునవ్వుతో మరణించటమే ఆనందం "

13, సెప్టెంబర్ 2012, గురువారం

తప్పు

తప్పు -
మొదటిసారి చేస్తే పొరపాటు,
రెండవ సారి చేస్తే అలవాటు,
మూడవ సారి చేస్తే వ్యసనం,
పదే పదే చేస్తే అది వ్యక్తిత్వం,
పొరపాటు,అలవాటు,వ్యసనం ఇవన్నీ ఎవరైనా మార్చవచ్చు.
కానీ వ్యక్తిత్వాన్ని ఎవరికి వారే మార్చుకోవాలి. లేదా ఒక గురువు మాత్రమే మార్చాలి.

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

6, సెప్టెంబర్ 2012, గురువారం

అమ్మ మేము నీ చేతిలో బొమ్మలమ్మ


 నచ్చిన అమ్మ పాట :

అమ్మ మేము నీ చేతిలో బొమ్మలమ్మ
కమ్మగ చూడమ్మా నమ్మినాము నిన్నమ్మ
కమ్మగా చూడమ్మా నమ్మినాము నిన్నమ్మ

దివి నుంచి మమ్ము నీవు భువికి తెచ్చి నావమ్మ
నువు తెచ్చి నావమ్మ మేము వచ్చినామమ్మ
సంసారమే చెట్టమ్మ మేము ఎక్కినామమ్మ
కొమ్మలమ్మ కొల్లగా లెక్క పెట్టలేమమ్మ

అమ్మ మేము నీ చేతిలో బొమ్మలమ్మ
కమ్మగ చూడమ్మా నమ్మినాము నిన్నమ్మ

దిక్కు తోచకున్నాము తప్పి పోయివున్నాము
దారి చూపు మా యమ్మ దరికి చేర్చు జయమ్మ

మొహమను ఉయ్యాల తూగులాడు చుందమ్మ
చేతులార బట్టి మమ్ము ఆదుకో మాయమ్మ...అమ్మా...అమ్మా...!

కొత్త పాట పాడమ్మా పాత ఊహలన్ని తుడిపి
సచ్చిదానందమేమో ఈయవమ్మ

అమ్మ మేము నీ చేతిలో బొమ్మలమ్మ
కమ్మగా చూడమ్మా నమ్మినాము నిన్నమ్మ..!

5, సెప్టెంబర్ 2012, బుధవారం

నీకై ఈ ప్రయాణం...!

ఎంతవరకు ఎంతవరకు
నీకై ఈ ప్రయాణం ఎంతవరకు
కట్టె కాలే వరకు
కన్ను మూసే వరకు
కట్టె కాలే వరకు
కన్ను మూసే వరకు
కన్నీటి ప్రవాహం ఆగే వరకు....!

22, ఆగస్టు 2012, బుధవారం

అమ్మా...!

నక్కి నక్కి నోట కరచేను కామ క్రోధములు,
వెక్కి వెక్కి ఏడ్చాను నీవు నా చెంతన లేక.

తొక్కి తొక్కి నలిపేను లోభ,మోహములు,
బిక్కు బిక్కు మన్నాను నీవు నా తోడు లేక.

రక్కి రక్కి గీచేను మద,మాత్సర్యములు,
దిక్కు దిక్కు వెతికాను నీ జాడ తెలియ లేక.

పూజలేమో నాకు తెలియదు, నీ నామము పిలుచుట తప్ప,
జపమేమో నాకు తెలియదు, నీ కొరకై తపము తప్ప,
నాదమేదో,భేదమేదో నాకు తెలియదు, నీకై ఖేదము తప్ప,
మంత్రమేదో,తంత్రమేదో నాకు తెలియదు, నిను ముద్దాడే స్వ తంత్రము తప్ప.

శ్వాసించే ఊపిరే నీకు ధూపము,
లోపల వెలిగే జీవుడే నీకు దీపము,
ప్రవహించే రక్తమే నీ కాలికి పారాణి,
నీవు కాని 'నేను' యే నీకు నైవేద్యం,
విలపించే కన్నీరే నీకు అభిషేకం అనుకో అమ్మా...!

కోపమొస్తే కొట్టు గాని, కనిపించుట మానకు. కంట నీరు పెడతాను,
తప్పు చేస్తే తిట్టు గాని, తలచుట మానకు. తల్లడిల్లి పోతాను.

ఏడ్చి ఏడ్చి అలసి సొలసి పోయాను. నీ ఒడి ని చేరి సేద తీర తలచాను,
ఇంకనూ నీవు కనిపించకుంటే, నన్ను అక్కున చేర్చుకోకుంటే....ఈ ఊపిరి ఆగేను, ఈ దీపం ఆరేను,
నేను నీవైపోతాను. నీలో కలిసిపోతాను.
నేను నీవైపోతాను. నీలో కలిసిపోతాను...!

కరుణించి కనిపించవమ్మా...అమ్మల గన్న యమ్మ..నను గన్న మాయమ్మ.
ముగురమ్మల మూలపుటమ్మ...చాల పెద్దమ్మ...అమ్మా...అమ్మా..అమ్మా...!